శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యుత్ కార్మికుడు బలయ్యాడు. విద్యుత్ షాక్‌తో కరెంటు స్తంభంపైనే వేలాడుతూ ప్రాణాలు వదిలాడు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ఏపీ ట్రాన్స్ కో టెండర్ ప్రాతిపదికన చేపడుతోంది. విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా రామాపురం గ్రామానికి చెందిన కార్మికుడు కృష్ణ(28) స్తంభంపై కరెంట్ పని చేస్తున్నాడు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై, స్తంభంపైనే పడిపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు విద్యుత్ కార్మికుడిని కరెంట్ ఫోల్ మీద నుంచి కిందకు దించి దేవస్థానం వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే కార్మికుడు మరణించినట్లు వైద్య సిబ్బంది తెలిపింది.
విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు. కార్మికుడు విద్యుత్ పనులు చేసేటప్పుడు సప్లై ఉందా లేదా అని పరిశీలించి, సప్లై లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పనులు చేయాలి. అయితే విద్యుత్ సప్లై లేనప్పుడు జనరేటర్ తో సప్లై అయినట్లు ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ కార్మికుడు మృత్యు పాలయ్యాడు..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..