భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనేక విధాలుగా మార్గదర్శకుడు. రాంచీ నుంచి వచ్చిన ఒక సాధారణ యువకుడు, తన అంకితభావం, కృషితో ప్రపంచ క్రికెట్‌ను జయించాడు. 2000ల ప్రారంభంలో ధోని భారత జట్టులో అడుగుపెట్టిన తర్వాత, టైర్-2, టైర్-3 నగరాల ఆటగాళ్లకు కొత్త మార్గం తెరిచాడు. అతని విజయంతో చిన్న పట్టణాల ఆటగాళ్లకు అవకాశం దొరికే మార్గం బలపడింది. ముఖ్యంగా, 2008లో ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత, చిన్న నగరాల నుంచి వచ్చిన ప్రతిభావంతుల కోసం బలమైన వేదికగా మారింది.
ఇటీవల, ధోని ఒక విద్యార్థి సమావేశంలో, చిన్న పట్టణాల యువతకు ప్రేరణ నింపేలా మాట్లాడాడు. “చిన్న పట్టణాల కలలు ప్రపంచాన్ని జయించగలవు. విజయం ఇకపై పిన్ కోడ్ మీద ఆధారపడి ఉండదు. రాంచీకి చెందిన ఒక బాలుడు దానిని సాధించగలిగితే, సరైన మార్గదర్శకత్వం, అంకితభావం, ఆలోచనా విధానంతో ఎవరైనా దానిని సాధించగలరు” అని ఆయన స్పష్టం చేశాడు.
ధోని మాటలు, ఎంతో మంది యువ ఆటగాళ్లకు శక్తినిచ్చేలా ఉన్నాయి. అతను ప్రత్యేకంగా ప్రాక్టీస్ లో ప్రాముఖ్యత ఉన్నట్టు తెలియజేశాడు. “ఫలితాల కంటే ప్రక్రియ ముఖ్యం. తెర వెనుక జరిగే తయారీపై దృష్టి పెట్టండి. ఇదే పెద్ద వేదికపై ప్రశాంతతకు, విజయానికి దారితీస్తుంది. నేను ఎప్పుడూ భారత జట్టులోకి రావాలనుకోలేదు. నేను ఆడే ప్రతి మ్యాచ్‌లో నా 100% ఇవ్వడంపై మాత్రమే దృష్టి పెట్టాను” అని చెప్పాడు.
క్రీడల ద్వారా జీవిత పాఠాలను నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ, ధోని ఇలా అన్నాడు.. “విజయం-వైఫల్యం రెండూ జీవితంలో భాగం. విజయానికి సంకల్పం, కష్టపడే తత్వం, గౌరవం, సవాళ్లను స్వీకరించే ధైర్యం అవసరం” అని అల్లెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి సదస్సు ‘సంగం’ కార్యక్రమంలో తెలిపాడు.
ధోని రాజకీయాల్లోకి వస్తాడా?
2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ, ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటికీ ఆడుతున్నాడు. అయితే, భవిష్యత్తులో పోలిటిక్స్‌లోకి వస్తాడా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ధోని గురించి మాట్లాడుతూ, “అతను మంచి రాజకీయ నాయకుడిగా మారగలడు. కానీ ఇది పూర్తిగా అతని నిర్ణయమే. అతను లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తాడని విన్నా, కానీ అతను ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు” అని పేర్కొన్నారు.
ఎంఎస్ ధోని పేరు వినగానే శాంతమైన నాయకత్వం, అద్భుతమైన ఫినిషింగ్, ఒత్తిడిలోనూ ప్రశాంతత గుర్తుకు వస్తాయి. తన విజయాలు, ప్రేరణాత్మకమైన మాటలు, క్రికెట్‌లో తాను తెచ్చిన మార్పులు – ఈ తరం క్రికెటర్లకు ఓ మార్గదర్శకం. పిన్ కోడ్‌తో సంబంధం లేకుండా అంకితభావం, కృషితో ఎవరైనా విజయం సాధించగలరని ధోని తన జీవితంతో నిరూపించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..